బొజ్జన్నపేటలో బెల్ట్‌షాపు నిర్వాహకుల ఆవేదన
కులం పేరుతో దూషించారంటూ ఆరోపణలు
వైన్స్ షాపు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిక
తొవ్వ న్యూస్,నర్సింహులపేట, సెప్టెంబర్. 15
కతొవ్వ న్యూస్,నర్సింహులపేట, సెప్టెంబర్. 15
క్వార్టర్ కు 20 రూపాయలు అదనంగా చెల్లించి మండల కేంద్రంలోని మధుర వైన్స్ షాపులో కొనుగోలు చేసిన మద్యాన్ని బెల్ట్‌షాపులో విక్రయించేందుకు తీసుకెళ్లిన తమపై అబ్కారి శాఖ అధికారులు తీవ్రంగా వ్యవహరించారంటూ నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన బెల్ట్‌షాపు నిర్వాహకులు చింతమల్ల యాకయ్య స్వాతి దంపతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా, తమను అవమానకరంగా దూషించారని వారు ఆరోపించారు.సుమారుగా 30నుంచి 40 వేల రూపాయల డబ్బులు కట్టి కొనుగోలుచేసిన సరుకు అబ్కారి శాఖ పట్టుకొని పోయినట్టుగా బాధితుడు ఆరోపిస్తున్నారు
ముఖ్యంగా కులం పేరుతో దూషించారంటూ బాధితులు ఆరోపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వైన్స్ షాపులోనే క్వార్టర్‌కు మద్యం కొనుగోలు చేసినప్పటికీ, దానిని బెల్ట్‌షాపుకు తీసుకెళ్లినందుకు తమపై అధికారులు జులుం చేశారని వారు వాపోయారు.
తమకు జరిగిన అవమానంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ సమస్యను పట్టించుకోకపోతే వైన్స్ షాపు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు ఇరువురు తమతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి మీద పోసుకొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గమనించిన వారు వెంటనే వారిపై నీళ్లు పోయడం జరిగింది
విచారణ జరిపి న్యాయం చేయాలి. ఈ ఘటనపై జిల్లా స్థాయి అబ్కారి ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదే సమయంలో కులం పేరుతో దూషించారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల వివరణ:
ఈ ఘటనపై అబ్కారి శాఖ అధికారుల వివరణ అందిన అనంతరం వారి వాదనను కూడా ప్రచురించాల్సి ఉంది. ఆరోపణలు, వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉంది.
