మనఊరు-మనబడి బిల్లులు రాక మేరుగు యాకన్న ఆవేదన – ప్రజావాణిలో మొర
పాఠశాల పనులు పూర్తి చేసి అప్పులపాలైన చైర్మన్
బిల్లులు ఇవ్వని అధికారులు – ఆత్మహత్యే శరణ్యం అంటున్న బాధితుడు
ప్రజావాణిలో మొరపెట్టుకున్న బొజ్జన్నపేట యం పి యు పి ఎస్ పాఠశాల చైర్మన్
మనఊరు-మనబడి పనులకు బిల్లులు రాక అప్పుల బాధ
తొవ్వ న్యూస్, నర్సింహులపేట, ఆగష్టు. 15.
మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన రోజే ఒక బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నారు.
మండలంలోని బొజ్జన్నపేట గ్రామానికి చెందిన మేరుగు యాకన్న – తండ్రి లాలయ్య ప్రజావాణికి హాజరై తన సమస్యను వివరించారు.
“నేను 2024 సంవత్సరంలో గ్రామంలోని MPUPS పాఠశాలకు చైర్మన్గా ఉన్నాను. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధి కోసం ప్రహరీ గోడ, వాటర్ సంపు, వంటగది, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి నల్లాలు వంటి పనులన్నీ మంజూరయ్యాయి” అని తెలిపారు.
“చైర్మన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నా సొంతంగా అప్పులు తెచ్చి పనులన్నీ పూర్తి చేశాను. కానీ ఇప్పటివరకు బిల్లులు రాలేదు. అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అనిపిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులకు బిల్లుల విషయమై ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆయన ఆరోపించారు.
ప్రజావాణి అధికారులు మేరుగు యాకన్న వినతిని స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాల అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు అప్పులపాలైన యాకన్న పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు.



