తెలంగాణలో ఎల్ .నీనో ప్రభావం ఎక్కువ…
ప్రజలు అప్రమత్తంగా వుండాలి….
THOVVA WEB NEWS.IN March01

ఈ ఏడాది వేసవిలో మొత్తం ఎల్ నినో ప్రభావంతో అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతం సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపిందిఎల్ నినో పరిస్థితులు వేసవి కాలం మొత్తం ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది భానుడి భగభగలు తప్పవని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. ఈశాన్య భారతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మార్చిలో సాధారణంగా కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మార్చి-మే మధ్యలో అధిక ఉష్ణోగ్రతలు’
మార్చి నుంచి మే మధ్యలో దేశంలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మార్చిలో ఉత్తర, మధ్య భారతంలో వడగాడ్పుల పరిస్థితుల ఉండకపోవచ్చని చెప్పారు. ఎల్ నినో పరిస్థితులు కొనసాగుతుండటం వల్ల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం వేసవి కాలం మెుత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత తటస్థ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు

అసలు ఏంటీ ఎల్ నినో?
ఎల్ నినో- పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగవచ్చని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ కాలేజ్ చేసిన ఓ అధ్యయనం ఇదివరకే హెచ్చరించింది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది.