‘మృతదేహాలను నేనే ఖననం చేశా….
నేత్రవతి నది వరద ఉధృతికి కొన్ని కొట్టుకొని పోయాయేమో…

Thovva, web news. In. August 17;
పాప ప్రజ్ఞ ఆత్మ నన్ను వెంటాడుతుందని . రాత్రి కలల్లో వందలాది ఆత్మలు వేమబడిస్తున్నాయని. ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమ ధర్మస్థలలో తానే వందలాది మృతదేహాలను పూడ్చి పెట్టానని ఒక టీవీ ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడిన సమయంలో వెల్లడించిన విషయాలు కలకలం రేపాయి. ‘మృతదేహాలను నేనే ఖననం చేశా. ఇప్పుడు అవి ఎందుకు దొరకడం లేదో తెలియడం లేదు. దానికి నేనేమి చేయాలి?’ అంటూ ఆగ్రహంగా ప్రశ్నించాడు. ‘నన్ను పాప ప్రజ్ఞ వెంటాడడం, కలలో మృతదేహాలు, అస్థిపంజరాలు కనిపించడంతోనే న్యాయస్థానం ముందుకు వచ్చా. సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించా. అడవి కావడం, రహదారి విస్తరణ, భారీ వర్షాలకు మట్టితో పాటు కొన్ని మృతదేహాలు, అవశేషాలు కొట్టుకుని వెళ్లి ఉంటాయి’ అని వివరించాడు. నేత్రావతి తీరం ఒక్క చోటే తాను 70 మృతదేహాలను ఖననం చేశానని చెప్పాడు. నేత్రావతితో పాటు వచ్చిన మన్ను మేటలు వేయడం, అప్పటి మొక్కలు నేడు భారీ వృక్షాలుగా మారడంతో కచ్చితమైన ప్రదేశాలు కొన్ని తప్పిపోయి ఉంటాయని పేర్కొన్నాడు. ఖననం చేసే సమయంలో తనతో పాటు మరికొందరు ఉన్నారని, వారు కూడా సిట్ ముందుకు వచ్చి సాక్ష్యం చెబుతారని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే చూపించిన 16 ప్రాంతాలతో పాటు మరో పాతిక ప్రాంతాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

భీమా ఖననం చేయడం తెలుసు…
ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో భీమ మృతదేహాలను ఖననం చేయడాన్ని తాము చూశామని కొత్తగా ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ముందుకు వచ్చిన సాక్షులు తుకారామ గౌడ, పాండురంగ తెలిపారు. భీమ కొన్ని చోట్ల మృతదేహాలను తీసుకువెళ్లి పూడ్చడాన్ని 2009లో చూశామని, మరికొన్నింటికి తాము సహాయంగా వెళ్లామని చెప్పారు. ఆ రోజు మేము చూసిన భీమకు- ఇప్పుడు మాస్కు వేసుకుని వెళ్లిన వ్యక్తికి పొంతనే కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను పూడ్చిన ప్రదేశాన్ని చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. నేత్రావతి నదీ తీరంలో ఒక మృతదేహాన్ని ఖననం చేయడం వెనుక స్థానిక పోలీసు అధికారి ఒకరు ఉన్నారని మరో స్థానికుడు పురందర గౌడ ఆరోపించారు. ఈ పాతికేళ్లలో నేత్రావతి తీరంలో జరిగిన అభివృద్ధి పనులతోనే మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించడంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నాడు. ఒక రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కారు డిక్కీ నుంచి మృతదేహాన్ని దించి, అప్పటికే తీసిన గుంతలో ఖననం చేయడం చూశానని చెప్పాడు. ఘటన జరిగి పదహారేళ్లయిన అనంతరం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడంతో ధైర్యంగా ముందుకు వచ్చానని ఆయన తెలిపారు.

ఎక్కడికి పోలేదు
మంగళూరు, న్యూస్‌టుడే : తాను పరారయ్యానని కొందరు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని- ధర్మస్థలలో కనిపించకుండా పోయిన వైద్య విద్యార్థిని అనన్యభట్ తల్లి సుజాతా భట్ ఖండించారు. తన కుమార్తె 2003లో ధర్మస్థలకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపించకుండా పోయిందని, ఆమె హత్యకు గురైందన్న అనుమానాన్ని ఇప్పటికే సుజాత వ్యక్తం చేశారు. తన కుమార్తె అస్థిపంజరాన్ని ఇప్పిస్తే విధివిధానాలను పూర్తి చేసుకుంటానని ధర్మస్థల, బెళ్తంగడి ఠాణాలో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాను కనిపించకుండా పోయానని కొందరు ప్రచారం చేయడంతో సెల్ఫీ వీడియో విడుదల చేసి, తాను సురక్షితంగా, క్షేమంగా ఉన్నానని, ఎక్కడకూ పరారు కాలేదని స్పష్టం చేశారు.

’ధర్మస్థలకు చెడ్డపేరు తేకండి
ధర్మస్థలకు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని తుపాకీతో కాల్చి చంపాలని మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య డిమాండ్ చేశారు. వందలాది మృతదేహాలను పూడ్చి పెట్టానని ముసుగు వ్యక్తి 16 ప్రాంతాలను చూపించగా, ఒకచోట మినహా మిగతా ఎక్కడా అస్థిపంజరాలు లభించలేదని గుర్తు చేశారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న ధర్మస్థల, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, తమవారు మరణిస్తే వాటిని అటవీ విభాగంలోనే ఖననం చేసేవారని గుర్తు చేసుకున్నారు. హిందువుల ఆలయాలు, సంస్థలకు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు తెరవెనుక ఉన్న వారెవరో స్థానికులు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు.
